వచ్చి రాగానే వసూళ్ల పర్వం..!
జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్ అధికారి నిర్వాకం
ఇటుక బట్టీ యజమానుల నుండి రూ.7000 వసూల్
కూపీ లాగుతున్న ఇంటలిజెన్స్ వర్గాలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్లో తాజాగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి వచ్చి రాగానే వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తన పరిధిలో ఉన్న ఇటుక బట్టీ యజమానుల నుండి ఒక్కో బట్టీకి ₹7,000 చొప్పున వసూళ్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించి నెల గడవక ముందే ఇలాంటి ఆరోపణలు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు, తనిఖీలు, కేసుల పేరుతో యజమానుల నుండి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటుక బట్టీల యజమానులకు ఇది మరింత భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.“ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుంది?”అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా వచ్చిన అధికారిపై మొదటి నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ వ్యవహారం పై ఇంటలిజెన్స్ వర్గాలు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా కూపీ లాగుతూన్నట్లు సమాచారం.ప్రజలను రక్షించాల్సిన పోలీసులపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


