బీజేపీకి అరూరి రమేష్ గుడ్‌బై…
బీఆర్ ఎస్‌లోకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రీఎంట్రీ!
28న గులాబీ కండువా కప్పుకోనున్న రమేష్
రాజకీయ లెక్కలే.. యూటర్న్‌కు కారణమా?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజకీయ ప్రయాణం మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి *భారత రాష్ట్ర సమితి*లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎల్లుండి (జనవరి 28) అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవడం, పార్టీలో క్రియాశీలత తగ్గడం ఆయన అసంతృప్తికి కారణమైందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఫలితాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక మరోవైపు బీఆర్ఎస్లో తిరిగి చేరడం ద్వారా పాత పరిచయాలు, రాజకీయ బలం తిరిగి పొందాలనే వ్యూహంలో భాగంగానే ఆరూరి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గులాబీ పార్టీలో ఆరూరి రీఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారతాయా? అన్నది ఆసక్తిగా మారింది.


