వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్
రమేష్ రీఎంట్రీతో రాజకీయ సమీకరణాల్లో మార్పు
మున్సిపల్ ఎన్నికల ముంగిట వేగం పెంచిన కారు
కార్పోరేటర్లు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ అరూరి వ్యాఖ్యలు
జీడబ్ల్యూఎంసీపై పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహ రచన
వర్ధన్నపేట–స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రాలపై గట్టి ప్రభావం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ‘ఘర్ వాపసీ’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఆర్ఎస్‌లోకి తిరిగి రావడం జిల్లా రాజకీయాల్లో వేగంగా మార్పులు తెస్తోంది. పార్టీ మార్పులతో పాటు నేతల వలసలు, ఎన్నికల వ్యూహాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈనెల 28న కేసీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ ఎస్‌లో చేరనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటంతో, ఈ రీఎంట్రీ పార్టీకి వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న పలువురు కార్పొరేటర్లు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆరూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ వలసలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కదలికలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జీడబ్ల్యూఎంసీపై పట్టు సాధించే లక్ష్యంతో బీఆర్ఎస్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు బీఆర్ఎస్ గట్టి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బలమైన నాయకత్వం, అనుభవం ఉన్న అరూరి రమేష్ రాక పార్టీకి అదనపు బలం చేకూరుస్తుందని విశ్లేషణ జరుగుతోంది. గతంలో ఆయన జిల్లా స్థాయిలో పార్టీని సమన్వయం చేసిన అనుభవం ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్ధన్నపేటతో పాటు స్టేషన్ ఘన్‌పూర్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు డివిజన్లలో ఆరూరి రమేష్‌కు గణనీయమైన ప్రభావం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం వంటి అంశాలు ఆయన్ను బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబించే అవకాశముందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల వ్యూహాలకు పదును..!
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి మున్సిపాలిటీకి ఇంచార్జీలను నియమించి, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. వరంగల్ కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ పావులు కదుపుతోంది. ఆరూరి రమేష్ రీఎంట్రీతో ఈ వ్యూహాలకు మరింత పదును పెరుగుతుందన్న చర్చ పార్టీ క్యాడర్‌లో జరుగుతోంది. మొత్తానికి, వరంగల్ రాజకీయాల్లో ‘ఘర్ వాపసీ’ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే కీలకాంశంగా మారుతున్నాయి. పార్టీ మార్పులు, నేతల వలసలు, వ్యూహాత్మక నియామకాల మధ్య జిల్లా రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.


