అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా
మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో జరిగిన ఘటనపై చర్య
డారిల్ మిచెల్‌పై బంతి విసిరిన ఘటనపై అర్ష్‌దీప్
తప్పు జరిగిందని వెంటనే క్షమాపణ చెప్పిన భారత బౌలర్
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా గుర్తింపు
కాకతీయ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ విసిరిన బంతి న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ శరీరాన్ని తాకింది. ఈ ఘటనను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని నిబంధనల ఉల్లంఘనగా గుర్తించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ప్రకారం ఆటగాడిపై ప్రమాదకరంగా లేదా అనుచితంగా బంతి లేదా ఇతర సామగ్రిని విసరడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఘటన అనంతరం అర్ష్‌దీప్ వెంటనే డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పినట్లు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతి వేయలేదని, రివర్స్ స్వింగ్ కారణంగా బంతి అతని శరీరాన్ని తాకిందని వివరించాడు. మ్యాచ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం చేతులు కలుపుకొని మాట్లాడుకున్నట్లు కూడా తెలిసింది. జట్టులో ఉన్న మ్యాచ్ విజేతలపై తమకు పూర్తి నమ్మకం ఉందని అర్ష్‌దీప్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ విజయం ఆనందం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని, కొద్ది రోజుల తర్వాతే ఆ భావోద్వేగం తెలుస్తుందని ఆయన అన్నారు.


