పెద్దవంగరలో ‘అరైవ్ అలైవ్’ అలర్ట్
విద్యార్థులకు రోడ్డు భద్రత పాఠాలు
ప్రమాదాల నివారణే లక్ష్యం
కాకతీయ, పెద్దవంగర : రోడ్డు ప్రమాదాలను నివారించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం రైతు వేదికలో పలు పాఠశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో వ్యాసరచన పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం నినాదం కాదని, ప్రతి ఒక్కరు సురక్షితంగా ఇంటికి చేరాలనే సంకల్పమని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్ వంటి తప్పిదాలు అనేక ప్రాణాలను బలితీసుకుంటున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల సహకారం కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


