నోబెల్ అందుకుంటే అరెస్ట్.. మచాడోకు కొత్త చిక్కులు!
మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
అవార్డు వచ్చినా తీసుకోవడం కష్టమే
నార్వేకు వెళ్లితే జైలే
కాకతీయ, ఇంటర్నేషనల్ డెస్క్: ఈ ఏడాది నోబెల్ శాంతి బాహుబతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. తాను షాంతి దూతనని, ప్రపంచాన్ని యుద్ధాల నుంచి దూరం పెట్టానని ఎంతగా ప్రచారం చేసుకున్నా.. చివరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అతనిని పక్కన పెట్టి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ప్రకటించింది. ప్రజాస్వామ్యం, ప్రజా హక్కుల కోసం ఆమె చేసిన అహర్నిశ పోరాటానికి ఫలితంగానే ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు కమిటీ వెల్లడించింది.
మచాడోకు ప్రపంచ స్థాయి ప్రతిష్ట దక్కింది. కానీ సమస్య ఎక్కడో అక్కడ కాదు… ఆమె స్వంత దేశంలోనే. నోబెల్ అందుకోవడానికి నార్వేకు వెళ్తే… ఆమెను`పరారీలో ఉన్న మహిళ’గా పరిగణిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. మచాడోపై ఇప్పటికే ఉగ్రవాదం, కుట్ర, ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు దేశం విడిచి వెళ్లడం ‘పలాయనం’గా పరిగణిస్తామని ప్రభుత్వం అంటోంది. దీని అర్థం అమె నోబెల్ అందుకోవడానికి వెళ్లినా, తిరిగి వెనిజులాకు చేరుకునే ముందు అరెస్టు అయ్యే అవకాశమే ఎక్కువ.
మచాడో చాలా కాలంగా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేస్తున్నారు. ఆ పాలనను నేరస్థుల ప్రభుత్వంగా ఖండిస్తూ, వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా మదురో ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మచాడోకు నోబెల్ రావడం మదురో ప్రభుత్వానికి అంతగా నచ్చకుండా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆమెపై కేసుల ఒత్తిడిని పెంచుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డిసెంబర్ 10న నార్వేలో జరిగే అవార్డు కార్యక్రమానికి హాజరుకావాలన్న ఆలోచన మచాడో ఇటీవలే వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. తాను దేశంలో దాగి ఉన్నానని ఇప్పటికే ఆమె పేర్కొనడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. అవార్డు ఆమెకే వచ్చినా… స్వయంగా అందుకోవడం మాత్రం ఆమెకు భారీ ప్రమాదంగా మారింది.


