- కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 7న శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. డయాస్, సీటింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా కలెక్టర్ సూచనలు చేశారు. యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని, ఐడీ కార్డులు ఉన్నవారినే అనుమతించాలని, గేట్ల వద్ద తనిఖీ బృందాలను నియమించాలని ఆదేశించారు. యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ప్రొఫెసర్ బీ.జే.రావు కూడా స్నాతకోత్సవానికి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీసీపీ వెంకటరామిరెడ్డి, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.


