అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి
విద్యుత్, వైద్యం, పారిశుధ్యలోపం కనిపించొద్దు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి సమీక్ష సమావేశం
కాకతీయ, వరంగల్ బ్యూరో : అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతంగా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, సాగునీటిపారుదల, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలు గుర్తించి, రైతులతో చర్చించి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇందుకోసం సంబంధిత రైతులకు రూ.5 వేల పరిహారం అందించాలని తెలిపారు. జాతరకు వచ్చే రహదారుల్లో మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భక్తులు స్నానాలు చేసే ఎస్సారెస్పీ కాలువ, అగ్రంపహాడ్ చెరువు వద్ద తగిన నీటి లభ్యత ఉండేలా సాగునీటిపారుదల శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్, వైద్యం, పారిశుధ్య ఏర్పాట్లు
నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోడ్ల వెంట అదనంగా విద్యుత్ స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
జిల్లాలోనే అతిపెద్ద జాతర – కలెక్టర్
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర జిల్లాలోనే అతిపెద్ద జాతర అని, సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. ఇక్కడ దర్శనం అనంతరం మేడారానికి భక్తులు తరలివెళ్తారని చెప్పారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
సీసీ కెమెరాలు పెంపు – ఆలయ ఈవో
ఆలయ ఈవో నాగేశ్వర్ రావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ తరపున జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలతో పాటు ఈ జాతరకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పరకాల ఏసీపీ సతీష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, ఆర్టీసీ డీఎం దరంసింగ్, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, అగ్రంపహాడ్, అక్కంపేట, చౌళ్లపల్లి సర్పంచులు మహేందర్, సాంబయ్య, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


