కొత్తకొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు
అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
9 నుంచి 18 వరకు వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
కాకతీయ, హనుమకొండ : కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు కలెక్టర్ స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను (జాతర) విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినట్లు తెలిపారు.
భక్తుల సౌకర్యాలే ప్రథమ లక్ష్యం
భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివార్లను దర్శించుకునేలా ఆలయ పరిసరాల్లో బ్యారికేడింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా సరిపడా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చుట్టుపక్కల ఖాళీ స్థలాలను గుర్తించి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, ఇందుకు దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల పనులను తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం పర్యవేక్షించాలని తెలిపారు.
ఆలయంలో ప్రత్యేక భద్రతా చర్యలు
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయించామని, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భద్రతా దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ సిద్ధమల్ల రమ, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ ఆత్మారామ్, ఆర్టీసీ డీఎం అర్పిత, ఎస్సై రాజు, ఆర్ & బి డీఈ గోపికృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


