స్వేచ్ఛయుత ఎన్నికలకు ఏర్పాట్లు
మునిసిపల్ పోరుకు పూర్తి సన్నద్ధత
జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు
117 వార్డులు.. 242 పోలింగ్ కేంద్రాలు
25 సెన్సిటివ్, 33 క్రిటికల్ కేంద్రాల గుర్తింపు
నామినేషన్లకు 43 కేంద్రాల ఏర్పాటు
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్రంలో 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఐదు మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 117 వార్డులు ఉండగా, 242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలక్టోరల్ రోల్‌కు సంబంధించి వచ్చిన 417 అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించినట్లు వివరించారు.
ఎన్నికల యంత్రాంగం సిద్ధం
సత్తుపల్లి మునిసిపాలిటీలో 28,830 మంది, మధిరలో 25,679 మంది, వైరాలో 24,689 మంది, ఏదులాపురంలో 45,256 మంది, కల్లూరులో 18,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 మంది రిటర్నింగ్ అధికారులు, 55 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 291 మంది ప్రిసైడింగ్ అధికారులు, 948 మంది ఓపిఓలను నియమించినట్లు తెలిపారు. అదనంగా 26 జోనల్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 ఎస్‌ఎస్‌టీ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల ఖర్చుపై నిఘా కోసం ఐదుగురు వ్యయ పరిశీలకులు, రెండు అకౌంటింగ్ బృందాలను నియమించినట్లు వెల్లడించారు.
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ..
నామినేషన్ల స్వీకరణకు ఏదులాపురంలో 13, కల్లూరులో 7, మధిరలో 8, సత్తుపల్లిలో 8, వైరాలో 7 కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 43 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏదులాపురానికి 166, కల్లూరుకు 96, సత్తుపల్లికి 113, మధిరకు 106, వైరాకు 99 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. 242 పోలింగ్ కేంద్రాల్లో 25 సెన్సిటివ్, 33 క్రిటికల్ కేంద్రాలను గుర్తించి భద్రతను పటిష్టం చేశామని, 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేసిన కలెక్టర్, అన్ని వర్గాల ప్రజలు సహకరించి స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.


