మానవ హక్కుల కమీషన్ ఆదేశాలు గాలికేనా?
వికలాంగ బాలికకు నాలుగేళ్లుగా దక్కని న్యాయం
ప్రజావాణిలో ఫిర్యాదు.

కాకతీయ, కరీంనగర్ : మానవ హక్కుల కమీషన్ 26-02-2020 న జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలుకావడం లేదని బాధిత తండ్రి షేక్ మునవర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్ నగరంలోని అహ్మెదుర ప్రాంతం, ఇం.నెం. 5-9-230 లో నివాసముంటున్న షేక్ మునవర్ పాషా తన పెద్ద కూతురు అతిఫా మెహరీన్ (మానసిక, శారీరక వికలాంగురాలు) సంక్షేమం కోసం 25-02-2020 న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించారు. దరఖాస్తును పరిశీలించిన కమీషన్, బాలిక ఆరోగ్యం, మందులు, డబుల్ బెడ్ రూం తదితర సంరక్షణ అంశాలపై 26-02-2020 న అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆ ఆదేశాలు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వాటి అమలు జరగలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మానవ హక్కుల కమీషన్ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అంటూ ప్రశ్నిస్తోంది.ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు షేక్ మునవర్ పాషా తెలిపారు. తన కుమార్తెకు చట్టప్రకారం దక్కాల్సిన హక్కులు వెంటనే అమలు చేయాలని, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించి న్యాయం చేయాలని ఆయన కోరారు.


