అరకు టు మహబూబాబాద్
గాంజా తీసుకొస్తుండగా పోలీసులకు చిక్కిన యువకులు
ఒకరు మల్యాల వాసి.. మరోకరు కరీంనగర్ వాసి
చిన్న చిన్న ప్యాకెట్లతో సరఫరా.. మాటు వేసి పట్టుకున్న కురవి పోలీసులు
స్వాధీనం చేసుకున్న గాంజా విలువ రూ.1.5 లక్షలు
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో ఇద్దరి నుంచి రూ. రూ.1.5 లక్షల విలువ చేసే గాంజాను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన పటేల్ పవన్ కృష్ణ, మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామానికి చెందిన ఓర్సు చందులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, చిన్న పాకెట్లుగా చేసి మహబూబాబాద్‌లో విక్రయించడానికి తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో 3 కిలోల నిషేధిత గంజాయి పట్టుకున్నారు. కురవి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గండ్రాతి సతీష్, ఎస్ ఐ జయకుమార్ లతో కూడిన సిబ్బంది కురవి–ఖమ్మం రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా నల్లరంగు పెయింట్‌తో ఉన్న ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని వెంటనే పట్టుకుని, వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేసినప్పుడు 3 కిలోల గంజాయి లభించింది.
గంజాయి పట్టివేతలో ప్రతిభ కనబర్చిన ఎస్ ఐ గండ్రాతి సతీష్, ఎస్ ఐ జయకుమార్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శబరిష్ , మహబూబాబాద్ డీఎస్పీ ఎన్. తిరుపతి రావు, రూరల్ సీఐ పి. సర్వయ్య అభినందించారు.


