ఏపీపీ రాతపరీక్ష వాయిదా వేయాలి
తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు
కాకతీయ,హుజురాబాద్ : పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాతపరీక్షను నిర్వహించడం వల్ల వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు ఇబ్బందుల్లో పడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరీక్ష తేదీని మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయని, ఇదే రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఏపీపీ రాతపరీక్షలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.పరీక్షా కేంద్రాలను కేవలం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించడం లేదా పరీక్షకు హాజరుకావడం అనే రెండు సమస్యల మధ్య నిలిచిపోయారని ముక్కెర రాజు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు (ఆర్టికల్ 326)తో పాటు భావప్రకటన స్వేచ్ఛ (19(1)(a))లో ఇది అంతర్లీనంగా భాగమని ఆయన వివరించారు.న్యాయవాదుల హక్కులను పరిగణనలోకి తీసుకుని ఏపీపీ రాతపరీక్షను వాయిదా వేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే పునరాలోచించాలని ఆయన కోరారు.


