శిశుమందిర్‌లో అవినీతి వ్యతిరేక భావజాలం
విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించిన హమ్
కాకతీయ, కరీంనగర్ : అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హమారా ఉన్నత్ మార్గ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీషు మిడియం హైస్కూల్లో అవినీతి వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించగా విద్యార్థులు విశేషంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.వ్యాసరచన విభాగంలో బొమ్మ సాయి శ్రేష్ఠ ప్రథమ, నామాల దేవిశ్రీ ద్వితీయ, ఎర్ర అభిజ్ఞ తృతీయ స్థానాలను సాధించారు. ఉపన్యాస పోటీల్లో గాండ్ల రక్షిత ప్రథమ,కొమ్ము మహేష్ ద్వితీయ, ఆదిత్య తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. విజేతలకు హమ్ వ్యవస్థాపకుడు ధన్‌పురి సాగర్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భారత భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులే అవినీతి అనే సామాజిక వ్యాధిని ఎదుర్కోవాలి. చిన్న వయసు నుంచే నిజాయితీ, నైతిక విలువలను అలవర్చుకోవాలి అని సూచించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పలువురు మేధావులు, స్థానికులు ప్రశంసలు తెలిపారు. అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడికీ బాధ్యత ఉందని, అవినీతి ఇవ్వడం,తీసుకోవడం రెండూ శిక్షార్హం అని పాఠశాల ప్రధానాచార్యుడు సముద్రాల రాజమౌళి విద్యార్థులకు సూచించారు.ఆవగాహన కార్యక్రమంతోపాటు చిన్నారుల్లో నైతికతపై చైతన్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం సందేశాత్మకంగా ముగిసింది.


