మామునూరుకు మరో రూ. 90 కోట్లు..
విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా నిధులు..
ఇప్పటికే రూ. 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ నిధులతో పూర్తికానున్న భూసేకరణ పనులు
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అదనంగా మరో రూ. 90 కోట్లు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. భూసేకరణ కోసం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 90 కోట్ల నిధులను మంజూరు ఇస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు.
త్వరలోనే పూర్తిస్థాయి కార్యకలాపాలు ..
వరంగల్ ప్రజల కల అయిన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఎంపీ కావ్య స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవతో మరో అడుగు ముందుకు పడిందని అన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్ భూ సేకరణ నిమిత్తం ఇప్పటికే రూ. 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎయిర్పోర్ట్ భూసేకరణకు అదనంగా 90 కోట్లు విడుదల చేయడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై చూపుతున్న దృష్టి అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్ట్ కీలక పాత్ర..
ఎంతో గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అని ఎంపీ కావ్య అన్నారు. వరంగల్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆకాంక్షలకు ఈ నిర్ణయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. వరంగల్ నగరం, హనుమకొండ, కాజీపేట ప్రాంతం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


