మోదీ ఖాతాలో మరో రికార్డు
భారత రాజకీయాల్లో నూతన మైలురాయి!
ప్రభుత్వ అధినేతగా అత్యధిక కాలం కొనసాగిన నేతగా గుర్తింపు
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బద్దలు
గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు ప్రయాణం
మూడు సార్లు వరుసగా ప్రధానిగా బాధ్యతలు
కాకతీయ, న్యూఢిల్లీ : భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా గుజరాత్లో, అనంతరం ప్రధానిగా కొనసాగుతున్న పదవీకాలాన్ని కలిపి మొత్తం 8,931 రోజులు ప్రభుత్వ అధినేతగా పనిచేసిన మోదీ… సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నమోదు చేసిన 8,930 రోజుల రికార్డును అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నాయకుడిగా నిలిచిన మోదీ… దేశ ప్రధానిగా కూడా విశేష అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ప్రధానిగా ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన… 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు పార్టీకి విజయం సాధింపజేశారు.
25 ఏళ్ల పాలన… సవాళ్ల నుంచి అవకాశాల దిశగా
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూకంపం, కరువు, తుఫానులు, రాజకీయ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొని… వాటిని అవకాశాలుగా మలిచామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో గుజరాత్‌ను ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సమయంలో దేశంలో విశ్వాస సంక్షోభం నెలకొన్నదని మోదీ పేర్కొన్నారు. 2014లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో దేశం కొత్త దిశగా ప్రయాణం ప్రారంభించిందని చెప్పారు.
పేదరిక నిర్మూలనపై ఫోకస్
గత 11 ఏళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ తెలిపారు. మహిళలు, యువత, రైతుల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. దేశ సేవ చేయడం తనకు అత్యున్నత గౌరవమని పేర్కొన్న మోదీ… రాజ్యాంగ విలువల ఆధారంగా ‘వికసిత భారత్’ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ రికార్డు కేవలం గణాంకం మాత్రమే కాకుండా… భారత రాజకీయాల్లో దీర్ఘకాల నాయకత్వానికి ప్రతీకగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


