అప్పుల బారిన మరో రైతు ఆత్మహత్య..
స్టేషన్‌ఘనపూర్‌లో విషాద ఘటన..
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండ గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలువేరు రవి (50) అనే రైతు గడ్డిమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రవి గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ, అదనంగా మామిడి తోటలను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. కానీ ఈ ఏడాది వర్షాభావం, కీటకాల దాడి, మార్కెట్ ధరలు తగ్గడం వంటివి కలిసి పంట దిగుబడి తీవ్రంగా తగ్గిపోయాయి. దీంతో పెట్టుబడికి చేసిన సుమారు రూ.15 లక్షల అప్పును తిరిగి చెల్లించే స్థోమత లేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంఘటన గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పంట ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో రైతులు అప్పుల్లో మునిగి ప్రాణాలు తీసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసు అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. అప్పుల బారిన పడ్డ రైతులకు ఆర్థిక సాయం, పంట బీమా వంటి చర్యలు వేగవంతం చేయాలని స్థానిక రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


