కాకతీయ, ములుగు : పీఎం శ్రీ విద్యాబోధనను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఫేస్ క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని ములుగు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ వర్షంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయ అధికారి రాజ్‌కుమార్‌కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు రత్నం రాజేందర్, కే.సమ్మక్క మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం బాధ్యతలు అంగన్వాడీలకే అప్పగించాలని, ఇన్స్ట్రక్టర్ల వేతనాలను టీచర్లు, హెల్పర్లకు అదనంగా ఇవ్వాలని కోరారు. ఫేస్ క్యాప్చర్ విధానం సాంకేతిక సమస్యలతో నిరుపేదలకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు. అలాగే బిఎల్ఓ వంటి ఏతర పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు కే.సరోజనతో పాటు అనేక మంది నాయకులు పాల్గొన్నారు.


