అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి
లంబాడి తండా కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ పోరిక సరిత
బాలామృతం, పౌష్టికాహారం అందించాలని సూచన
విద్యుత్, మంచినీరు, మరమ్మతులపై హామీ
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడి తండా అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ పోరిక సరిత పరిశీలించారు. అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మితో కలిసి కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించి పిల్లలకు బాలామృతం, పౌష్టికాహారం నిరంతరం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్, మంచినీరు, టాయిలెట్ సౌకర్యాలు లేవని, భవనానికి చిన్నపాటి మరమ్మతులు అవసరమని టీచర్ రాజ్యలక్ష్మి సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్ వెంటనే మంచినీరు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అంగన్వాడీ భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


