కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు
ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలు పంపిణీ
పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా
రాష్ట్ర మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే ప్రభుత్వం బలమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతీరోజు 100 మి.లీ పాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్ మహేందర్ జీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చిన్నపిల్లలను దేవుళ్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలన్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించి తెలంగాణను పోషకాహార లోప రహితంగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పిల్లలకు అందించే ప్రతి ఆహారాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు పరిశీలించాలని, అనారోగ్యానికి గురి చేసే వస్తువులు వచ్చిన పక్షంలో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి టీచర్ కు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలను పెంచామన్నారు. సొంత పిల్లల్లాగానే అంగన్వాడి పిల్లలను చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని సైతం అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని తెలిపారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, ప్రతి సెంటర్ నిర్వాహకులు పిల్లల తల్లిదండ్రులతో నిత్యం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తు చేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని తెలిపారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు మంత్రి ఆవిష్కరించారు. ఈ విషయంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఎంతో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరీష, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.


