అందెశ్రీ మరణం కళారంగానికి తీరని లోటు
నర్సంపేట కవులు, కళాకారుల ఆధ్వర్యంలో ఘన నివాళి..
తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ నెల్లుట్ల సుమన్
కాకతీయ నర్సంపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజా వాగ్గేయకారుడు డాక్టర్ అందెశ్రీ మరణం తెలంగాణ సాంస్కృతిక కళారంగానికి తీరని లోటని నర్సంపేట తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ నెల్లుట్ల సుమన్ అన్నారు. అనంతరం నర్సంపేట పట్టణంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీం లీడర్ సుమన్, సీనియర్ కళాకారుడు తాళ్ల సునీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేనిదని తెలంగాణ సమాజాన్ని తన పాటలతో చైతన్యపరిచి తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన ఆటపాటలతో యువతను ఉద్యమం వైపు మళ్లించిన గొప్ప కవి అందెశ్రీ అని గుర్తు చేశారు. తన పాటలు ప్రపంచ నలుమూలల విస్తరింపజేసి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఉద్యమ చరిత్రను ఖండాంతరాలకు పరిచయం చేసిన అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, కళారంగానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాకారులు తాళ్ల సునీల్, యోజన, గాదెపాక బాబు, పడిదం రాజేందర్, బరిగేల రవీందర్, మేఘం, పవన్, భాస్కర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


