నగర ప్రజల పక్షాన రాజీలేని పోరు
కాంగ్రెస్–బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్
కాకతీయ, కరీంనగర్ : నగర పాలకసంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్ తెలిపారు. శనివారం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగర ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, తమకు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్లో బీజేపీ గెలిచిన 30 సీట్లలో 11 మంది మాజీ బీఆర్ఎస్ నేతలే ఉన్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని సాధించిన విజయాన్ని నైతిక విజయంగా చెప్పలేమని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ పరాజయం పాలవడం కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఫల్యమని అన్నారు. మేయర్ ప్రమాణ స్వీకారానికి ముందే నగర అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన వారు, అదే పార్టీకి చెందిన వారిని బీజేపీలో చేర్చుకోవడం ఎలా సాధ్యమైందో వివరించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి భారీగా ఖర్చు చేశారని ఆరోపిస్తూ, ఆ నిధుల మూలాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్–బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హయాంలో అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామని ప్రకటించారని గుర్తుచేస్తూ, ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ల విషయంలో అలాంటి హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను లేకుండా చేస్తానని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ జక్కని ఉమాపతి, బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, రాచకొండ నరేష్, అనుమల్ల ఉమాశంకర్, దూలం సంపత్ గౌడ్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, దుర్గం శ్రీకాంత్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


