అంబర్ గుట్కా అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు : సీఐ సంతోష్
గుడెప్పాడ్‌లో వాహన తనిఖీల్లో ఇద్దరు అరెస్ట్
కాకతీయ, ఆత్మకూరు : ప్రభుత్వం నిషేధించిన అంబర్, గుట్కా, తంబక్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించగా, అంబర్–గుట్కా పాకెట్లను తరలిస్తున్న హుజురాబాద్‌కు చెందిన గోవింద్, మొహమ్మద్ ఆఫ్సరి బేగంను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మేడారం జాతరకు గుట్కా తరలిస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సంతోష్ విద్యార్థులతో కలిసి 5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, తిరుమలగిరి సర్పంచ్ బూర దేవేంద్ర రాజేందర్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, ముద్ధం కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు


