ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
రెండు ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసు
రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ రూరల్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంగళవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొమ్మకల్ గ్రామంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రూరల్ పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం… పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన దొంగల శ్రీనివాస్, గొల్లపల్లి గ్రామానికి చెందిన అనిల్ మానేరు నది నుండి అక్రమంగా ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు తరలించారు. ఇటీవల అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన నగునూరు గ్రామానికి చెందిన బోదాసు అచ్యుత్, బొమ్మకల్ గ్రామానికి చెందిన నేరెళ్ల శ్రీనివాస్‌లను కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ముందు హాజరుపరచి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు


