ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!
నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు
కొత్తపల్లి ఇసుక క్వారీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పోలీస్ కమిషనర్‌తో కలిసి పరిశీలన
అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలంటూ హెచ్చరికలు
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాల్సి ఉంటుందని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో కొనసాగుతున్న ఇసుక క్వారీని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దిగువ మానేరు జలాశయంలో పేరుకుపోయిన 0.3 టీఎంసీల పూడిక తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఈమోట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. పూడిక నుంచి ఇసుకను వేరు చేసి టీజీఎండిసి పర్యవేక్షణలో వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్న విధానాన్ని సీపీతో కలిసి సమీక్షించారు.

లోడింగ్, వేయింగ్‌పై కఠిన నిఘా
క్వారీ వద్ద ఇసుక లోడింగ్, వేయింగ్ ప్రక్రియలను పర్యవేక్షించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ రికార్డులు, వేబిల్లులను పరిశీలించారు. నిర్ణీత పరిమితికి మించి ఇసుక తరలించినా, కేటాయించిన వాహనాలకే కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి ప్రవేశించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలు, లోడింగ్ పరిమితి, వేబిల్లులు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక లోడింగ్ చేయరాదని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ లోడింగ్, వేయింగ్ సమయంలో ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. క్వారీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టీజీఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ సంజన, ఏఈ వంశీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


