అక్రమాలపై ఉక్కుపాదం
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
జిల్లా వ్యాప్తంగా పోలీస్ తనిఖీలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : నేరాలను అరికట్టేందుకు అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. అనుమానిత వ్యక్తులు, వాహనాల వివరాలు సేకరించి తర్వాత మాత్రమే వెళ్లనిస్తున్నట్లు తెలిపారు.


