కాకతీయ, కరీంనగర్ బ్యూరో: గణేశ్ నిమజ్జన వేడుకలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుంచే విగ్రహాల నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.
శుక్రవారం రోజున రెవిన్యూ, పోలీసు అధికారులతో మానకొండూరు చెరువును బండి సంజయ్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ..భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో హిందువులంతా ఐక్యంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలన్నారు. కరీంనగర్ నుండి సమాజానికి స్పూర్తిదాయక సందేశం వెళ్లాలి అని స్పష్టం చేశారు.
ఈసారి మండపాల సంఖ్య పెరిగిందని, చిన్నపిల్లలు కూడా తమ బస్తీల్లో మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారని వివరించారు. బాలగంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది దేశభక్తి కోసం అని, కాని కొందరు ఈ పండుగల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, విగ్రహాల తరలింపులో కరెంట్ వైర్లు, చెట్ల అడ్డంకులను తొలగిస్తున్నారన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


