అమృత్–2 పనులు పూర్తి చేయాలి
పెండింగ్ ప్రాజెక్టులు సోమవారంలోగా ప్రారంభించాలి
ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : అమృత్–2 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సోమవారం లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని కొత్తపల్లి ప్రాంతంలో కమిషనర్ పర్యటించి, అమృత్–2 పథకం కింద చేపట్టబోయే మంచినీటి సరఫరా అభివృద్ధి పనుల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫిల్టర్ బెడ్, రిజర్వాయర్, మంచినీటి పైపు లైన్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సీడీఎంఏ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్–2 పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టాలని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొత్తపల్లిలో కీలక పనులకు ఆదేశం
కొత్తపల్లి ప్రాంతంలో 3 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఫిల్టర్ బెడ్ నిర్మాణంతో పాటు 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి రిజర్వాయర్ (ట్యాంక్) పనులను తక్షణమే ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే ఆర్‌అండ్‌బి రహదారి వెంబడి సుమారు 3 కిలోమీటర్ల మేర చేపట్టనున్న మంచినీటి పైపు లైన్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, నాణ్యతలో రాజీ పడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీఈ దేవేందర్, సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


