అంబులెన్స్ సేవలు తక్షణం అందేలా చూడాలి
వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
కాకతీయ, కొత్తగూడెం: జిల్లాలో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సేవలు అందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. బుధవారం జిల్లా కార్యాలయంలో 102, 108 అంబులెన్స్ వాహనాల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లో కూడా అంబులెన్స్ వాహనాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే తమ పరిధిలో వాహనాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచి గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర అత్యవసర రోగులకు వెంటనే సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అంబులెన్స్ జిల్లా సమన్వయకర్తలు, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


