35 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
కిడ్స్ స్కూల్ 1989–90 బ్యాచ్ సమ్మేళనం ఘనం
కాకతీయ, ఖమ్మం : పాఠశాల దశలో ఏర్పడే స్నేహబంధాలు జీవితాంతం నిలిచేవని, అవి ఎప్పటికీ విడదీయలేనివని 1989–1990 కిడ్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 35 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు అన్నారు. 1989–1990 విద్యాసంవత్సరానికి చెందిన కిడ్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువారం ఖమ్మం నగరంలోని కోణార్క్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ ప్రస్తుత జీవన అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాఠశాలలో ఏర్పడిన స్నేహాలు జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా గడిచినా, స్నేహితులతో మళ్లీ కలవడం హృదయపూర్వక ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం తమకు విద్యాబోధన చేసిన అప్పటి ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. గురువులను ఎప్పటికీ మరచిపోకూడదని, ఇలాంటి సమావేశాల్లో వారితో కలిసి గడపడం ఎంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


