అల్లు అర్జున్ ఏ 11
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల ఛార్జిషీట్
ఏ 1గా థియేటర్ యాజమాన్యం
8మంది బన్నీ వ్యక్తిగత సిబ్బందిపైనా అభియోగాలు
మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ఛార్జిషీట్లో ఏ-11గా నటుడు అల్లు అర్జున్ పేరును చేర్చారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మేనేజర్, సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్థారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు.
అసలేం జరిగింది
2024 డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల టైంలో పుష్ప-2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో రేవతి (35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. వీరిద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. తక్షణమే స్పందిచిన పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, డిసెంబర్ 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్‌కు నాంపల్లి న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
షరతులతో కూడిన బెయిల్
2025 జనవరి 3న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు రెండు నెలల పాటుగా ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు చిక్కడపల్లి పోలీసుల విచారణకు అల్లు అర్జున్ హాజరుకావాలని కోర్టు అదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. ఒక్కొక్కరికి 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు అల్లు అర్జున్ దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడవద్దని కోర్టు సూచించింది. ఈకేసు సంబంధించిన సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయవద్దని కోర్టు హెచ్చరించింది. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్‌పై విడుదలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారంతా బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఇప్పటికీ చికిత్స పొందుతున్న శ్రీతేజ్మ
మరోవైపు ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ ఘటన జరిగి సంవత్సరం అయిన సందర్భంగా ఈ నెల 4న భాస్కర్ కుటుంబానికి అందుతున్న సహాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు వివరించారు. భాస్కర్, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకు వచ్చి రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని తెలిపారు.


