సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి
టిక్కెట్ ఎవరికైనా… కాషాయ జెండా మనదే
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నేతల బాసట
కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై నేతల సమీక్ష
రెబల్స్‌కు తావులేదని కేంద్రమంత్రికి స్పష్టం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : “టిక్కెట్ ఎవరికిచ్చినా మా డివిజన్‌లో బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తాం. మాకు టిక్కెట్ రాకపోయినా నారాజ్ కాబోం… రెబల్‌గా పోటీ చేయం… కలిసికట్టుగా ప్రచారం చేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం” అంటూ కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో నినదించారు. కరీంనగర్ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ ఏకగ్రీవ స్వరం బీజేపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో జరిగిన కీలక సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, కోమాల ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్
ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా ఉందని, ప్రజల చూపంతా బీజేపీ వైపేనని ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఎవరికీ ముందస్తు హామీలు ఇవ్వలేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేసిన వారికి టిక్కెట్లు ఉండవు అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. బీజేపీలో కుటుంబ పాలనకు తావులేదని స్పష్టం చేశారు.

సర్వేనే ప్రామాణికం
టిక్కెట్ల కేటాయింపులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపై నాయకుల అభిప్రాయాలను బండి సంజయ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన కార్పొరేషన్ నాయకులంతా చేతులెత్తి మరోసారి స్పష్టం చేశారు. “సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వండి… టిక్కెట్ ఎవరికిచ్చినా బీజేపీ గెలుపే లక్ష్యం… రెబల్స్ ఉండరు… కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుంది” అంటూ నినాదాలు చేశారు.
ఇదే సమయంలో గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతామని, బీజేపీకి ఓటేయకపోతే కరీంనగర్ ప్రజలకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్న వారిలో అవినీతిపరులు, కబ్జాదారులకు మాత్రం తావివ్వొద్దని ఈ సమావేశంలో స్పష్టమైన తీర్మానం చేశారు. గెలుపు అవకాశాలు ఉన్న గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని బండి సంజయ్ తుది మాటగా తేల్చారు.


