నల్లగొండలో ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు
కలెక్టర్ జోక్యం చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 30/186, 187లలో ఉన్న ప్రభుత్వ భూమి బీసీ ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఆ భూమిని దున్ని సాగు చేస్తున్నారని వారు తెలిపారు.గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం, గతంలోనే రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఆ భూమి ప్రభుత్వాధీనమని నిర్ధారించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో గ్రామస్థులు నిరాశ వ్యక్తం చేశారు.ప్రభుత్వ భూమిని కొందరు ప్రభావశీలులు కబ్జా చేసి సొంతంగా చేసుకుంటున్నారు. అధికారులు నిశ్శబ్దంగా చూస్తున్నారు. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ భూమి కాపాడే బాధ్యత అధికారులదే. వెంటనే చర్యలు తీసుకోవాలి అని వారు కలెక్టర్‌ను కోరారు.


