సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలం
మంత్రి శ్రీధర్ బాబు
కాకతీయ, కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ డివిజన్లతో పాటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. శనివారం నగర పాలక సంస్థ 8వ డివిజన్ పరిధిలోని అల్గునూరులో కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కార్పొరేషన్లో 40–45 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తమ ఓటమి ఖరారైందని గ్రహించి ఉనికికోసం పోరాడుతున్నాయని విమర్శించారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్–బీజేపీతో అభివృద్ధి సాధ్యంకాదని, గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి జరగలేదన్నారు.
రాంనగర్, టెలిఫోన్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ప్రచారం
కరీంనగర్ నగరంలోని రాంనగర్, టెలిఫోన్ క్వార్టర్స్ ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


