కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలి
బీఆర్ఎస్–బీజేపీలకు ఓటు వృథా : రాజేందర్రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని, వారికి నిరంతరం సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. శుక్రవారం నగరంలోని 35వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన దుగ్గు మహేందర్ నిహారిక రాజేందర్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ నగరం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, భూకబ్జాలు, అవినీతి పెరిగాయని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, గల్లీల సమస్యల నుంచి నగర స్థాయి సమస్యల వరకు పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్, ఆకుల ఉదయ్, కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.


