కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల్లో సంతోషం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్
నర్సింహులపేటలో ఘనంగా 141వ ఆవిర్భావ వేడుకలు
కాకతీయ, నర్సింహులపేట : నర్సింహులపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని అన్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను అంతం చేయాల్సిన అవసరం ఉందని జినుకల రమేష్ పేర్కొన్నారు. లౌకిక శక్తులను ఏకం చేసి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలపరిచి లౌకిక రాజ్యాన్ని తిరిగి నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకే భవిష్యత్తు
పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా గౌరవిస్తుందని అన్నారు. పార్టీ లైన్లో నడిచిన వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్, సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు అలువాల శ్రీనివాస్, మండల నాయకులు చిర్ర సతీష్ గౌడ్, సర్పంచులు రాజేందర్ నాయక్, లచ్చు నాయక్, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


