కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల 885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5 లక్షల 38 వేల 620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని 15 జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పత్తి కొనుగోళ్లకు రైతుల ఆధార్ ప్రమాణికమని, రైతులందరు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం, కపాస్ కిసాన్ ఆప్ లో నమోదు చేసుకునే విధంగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
జిన్నింగ్ మిల్లులలో మరమ్మతులు పూర్తి చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీసీఏ, విద్యుత్ తదితర శాఖల అధికారులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.


