అలీ సాగర్ నీటిని విడుదల చేయాలి
48 వేలకుపైగా ఎకరాలను కాపాడాలి
యాసంగి సీజన్ ప్రారంభమైనా పట్టింపు లేదు
తైబందీ ఖరారు కాలేదనే కారణంతో రైతులను హింసించొద్దు
ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలి
తెలంగాణ జాగృతి కళాకారులకు ఉద్యోగాలివ్వాలి
ఇందిరా పార్క్ వద్ద వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో: అలీ సాగర్ ఎత్తిపోతల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని 48 వేలకుపైగా ఎకరాల్లో అలీసాగర్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని గుర్తుచేశారు. యాసంగి సీజన్ ప్రారంభమైనా నీటిని విడుదల చేయకపోవడంతో మూడు నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. యాసంగి సీజన్ తైబందీ ఖరారు కాలేదనే కారణంతో ఇరిగేషన్ ఇంజనీర్లు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. రైతులు వరి నార్లు పోసుకొని నెల రోజులవుతోందని, తక్షణమే నీటిని విడుదల చేయకుంటే నార్లు ముదిరిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోతలు ప్రారంభించక పోవడం సరికాదన్నారు. ఒక్క నవీపేట మండలంలోనే 14 వేల ఎకరాల్లో అలీ సాగర్ కింద యాసంగి పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. యాసంగి వరి నాట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వలస వచ్చారని, నీటి విడుదల లో జాప్యం కారణంగా రైతులతో పాటు వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలీ సాగర్ ఎత్తిపోతలు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ
తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందిరా పార్క్ వద్ద కాళాకారులు చేపట్టే ఆందోళనలో పాల్గొంటామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ కళాకారులు కవితతో భేటీ అయ్యారు. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినవి మాట.. పాట.. ఎందరో పెద్దవాళ్లు తమ మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తే.. కళాకారులు ఊరూరా గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. ఉద్యమ ఆకాంక్షను నిలబెట్టింది కూడా తెలంగాణ పాటే.. వేలాది మంది కళాకారులు ఊరూరా తిరిగి గజ్జకట్టి ఆడిపాడారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు.. అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రానివాళ్లు ఇంకా ఉన్నారు.. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు.


