నూతనోత్సాహంతో సాగిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్
కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిర్వహించిన స్పోర్ట్స్ మస్త్ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. వావిలాల పల్లి అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో, అలాగే భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఈ వేడుకలు సందడి చేశాయి.ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ.క్రీడలు విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసి చదువుపై దృష్టి పెంచుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యం సాధించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆసక్తులను ప్రోత్సహించాలని సూచించారు.అల్ఫోర్స్ సంస్థల్లో పాఠ్య ప్రణాళికలో భాగంగా వివిధ క్రీడా పోటీలను తరచుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.వేడుకల్లో భాగంగా ఖోఖో, కబడ్డి, హ్యాండ్బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించారు. ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాకారుల పరిచయం, శుభాకాంక్షలతో పాటు క్రీడా జ్యోతి ప్రజ్వలనం నిర్వహించారు. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టేలా విద్యార్థులు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


