విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్-ఫలా.. వెలుగులోకి బిగ్ స్కామ్!
ఢిల్లీ బ్లాస్ట్ తరువాత వెలుగులోకి వచ్చిన అల్-ఫలా స్కామ్
అక్రిడేషన్ లేకుండానే కోట్ల రూపాయల వసూళ్లు
పన్ను రిటర్నుల్లో కూడా అదే ట్రిక్
కాకతీయ, జాతీయం : ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన తాజా దర్యాప్తులు అల్-ఫలా యూనివర్సిటీని దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. ఇటీవల ఫరీదాబాద్‌లో గుర్తించిన ఉగ్ర మాడ్యూల్ సభ్యులకు అల్-ఫలా యూనివర్సిటీతో లింకులు ఉన్నాయన్న విషయం బయటకు రావడంతో ఇండియన్ యూనివర్సిటీల అసోసియేషన్ (AIU) వెంటనే సదరు సంస్థ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే ఫోర్జరీ, మోసం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సంస్థపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. న్యాక్ కూడా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు మంగళవారం ఈడీ అధికారులు యూనివర్సిటీపై నిర్వహించిన దాడుల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అల్-ఫలా యూనివర్సిటీకి సరైన అక్రిడేషన్ లేకపోయినా, అది పూర్తి స్థాయి యూనివర్సిటీలా నడుపుతూ, విద్యార్థుల నుంచి సంవత్సరాల తరబడి భారీ ఫీజులు వసూలు చేశారు. అదీకాక, ఫీజులను స్వచ్ఛంద విరాళాలుగా చూపించడం అతిపెద్ద గోల్‌మాల్. 2014–15 నుండి 2024–25 వరకు ఏకంగా రూ.415.10 కోట్లు యూనివర్సిటీ ఖాతాల్లోకి రాగా.. ఈ భారీ మొత్తాన్ని అక్రమంగా విరాళాలుగా మార్చేశారని అధికారులు గుర్తించారు. గత 10 సంవత్సరాల పన్ను రిటర్నుల్లో కూడా యూనివర్సిటీ ఇదే పద్ధతిని కొనసాగించినట్లు అధికారులు వెల్లడించారు. ఫీజుల రూపంలో వచ్చిన మొత్తాన్ని డొనేషన్స్‌గా చూపించడం, పన్నుల ఎగవేత వంటి అంశాలు మనీ లాండరింగ్ అనుమానాలకు దారితీసింది.
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు పురోగమిస్తుండగా.. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, ట్రస్టీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తులో భాగంగా యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. నిధుల ప్రవాహం, లావాదేవీల వివరాలు, అక్రమంగా మార్చిన ఫీజు మొత్తాలు ఎక్కడికి వెళ్లాయన్నది ఈడీ ప్రస్తుతం లోతుగా విచారిస్తోంది.


