అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
కాకతీయ, సినిమా డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాకు త్రుటిలో పెను రోడ్డు ప్రమాదం తప్పింది. విదేశాల్లో తమ 25వ పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకుని వస్తుండగా అక్షయ్ కాన్వాయ్‌పై ఒక ఆటో దూసుకొచ్చింది. దీంతో అక్షయ్ ప్రయాణిస్తున్న కారుతోపాటు, ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కారు పరస్పరం ఢీకొన్నాయి. అందులో ఒక కారు బోల్తా కూడా పడింది. ముంబయిలోని జుహు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తూ అక్షయ్, ట్వింకిల్ ఖన్నా సహా ఇతర సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనం నడిపినందుకు జుహు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు.


