ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సురేఖ
ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఉత్సవాలు ప్రారంభం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐనవోలు మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
తాత్కాలిక బస్‌స్టాండ్ ప్రారంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్‌స్టాండ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయ కమిటీ, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
భక్తులకు శాంతి, శ్రేయస్సు కలగాలి
భోగి పర్వదినాన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఐనవోలు ఆలయం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ప్రాచీన క్షేత్రమని తెలిపారు. భోగి పండుగ పాత కష్టాలను విడిచి కొత్త ఆశలతో ముందుకు సాగాలని సూచించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని, వర్ధన్నపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


