కాకతీయ, హనుమకొండ : దేశ వ్యవసాయ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించి, భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరం సాగు భూమి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో జరిగిన సి పి ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల ఎకరాల భూసంపద ఉండగా 15 కోట్ల ఎకరాలు సాగులోకి రానివని, వాటిని వినియోగంలోకి తేవాలని సూచించారు.
రైతు పంటలకు పెట్టుబడికి 50శాతం లాభం కలిపిన కనీస మద్దతు ధర ప్రకటించాలని, ధరల నియంత్రణకు కేంద్రం లక్ష కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీల మాదిరిగా రైతులకు రుణాలు, భూమి, కరెంటు అందించాలని, సబ్సిడీ విత్తనాలు, ఉచిత కరెంటు, ఆహార పంటల ప్రోత్సాహం ద్వారా ఆహార భద్రత సాధ్యమని చెప్పారు.
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకురావడానికి రైతు ఉద్యమం కారణమని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు నేదునూరి రాజమౌళి, మెట్టు శ్యాంసుందర్ రెడ్డి, ఇతరులు వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని, పంటల బీమా పరిహారం 30 రోజుల్లో చెల్లించాలని, ఆదివాసులకు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సి పి ఐ నాలుగవ మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు.


