అభివృద్ధికి ఆమడా దూరంలో అగ్రంపహాడ్ జాతర
మినీ మేడారంపై అధికారుల నిర్లక్ష్యం
సౌకర్యాల లేమితో భక్తుల అవస్థలు
స్నానఘట్టాలను నిర్మించి నీళ్ల ఏర్పాటు మరిచారు
నీళ్ల సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్న భక్తులు
అపరిశుభ్రంగా కెనాల్ కాలువలు..పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
కాకతీయ, ఆత్మకూరు : మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన *అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర*పై అధికారుల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోందని జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానుండగానే తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నా, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్నాన గట్టలు, కెనాల్ కాలువలు ఇప్పటికీ సరిగా ఏర్పాటు చేయకపోవడం, శుభ్రతా చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ అగ్రంపహాడ్ జాతరలో శాశ్వత నిర్మాణ పనులు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్న గ్రామ ప్రజల్లో గుసగుసలుగా మారింది. ప్రతిసారి తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమవుతుండటంతో జాతర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, స్నాన గట్టలు, భక్తుల విశ్రాంతి కోసం శాశ్వత మౌలిక వసతులు కల్పిస్తే ఏటా ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

స్నాన ఘట్టాల్లో నీళ్ల కరువు
ఆదివారం అమ్మవార్ల దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు స్నానాలు చేయడానికి స్నాన గట్టల వద్ద నీరు లేక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “గట్టలు వేశారు… నీళ్లు మరిచారు” అంటూ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ఇదే సమయంలో కెనాల్ కాలువలో నీటితో స్నానం చేద్దామని వెళ్లిన భక్తులకు అపరిశుభ్రంగా మారిన కాలువలు ఎదురుకావడంతో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కోరికలు తీర్చే వానదేవతలుగా భావించే సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో తలనీలాలు సమర్పిస్తూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

పేరుకే రహదారి మరమ్మతులు
చౌళ్లపల్లి నుంచి అగ్రంపహాడ్ జాతరకు వచ్చే ప్రధాన రహదారిపై నాణ్యత లేని మరమ్మత్తులు జరిగాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే డాంబర్ చిప్పలు లేచి రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయని, కాంట్రాక్టర్లు–అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


