- రైతు బీమా కోసం వెళ్తే లంచం వేధింపులు
- బాధిత రైతు కుటుంబ సభ్యుడు పదివేలు ఇస్తుండగా పట్టివేత
- ఏసీబి డీఎస్పీ సాంబయ్య
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు ఏఈవో పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలం నీలకుర్తి గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గాడిపల్లి సందీప్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలిపారు. ఆనెపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అనారోగ్యంతో ఈ మధ్య కాలంలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు రైతు బీమా క్లియరెన్స్ కోసం వెళ్లగా ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. తాము అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేమని బతిమిలాడినా సదరు అధికారి ససేమీరా అన్నాడు. చేసేదేంలేక పదివేల రూపాయలు ఇవ్వగలమని ఒప్పుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
ఈ మేరకు వలపన్నిన ఎసీబీ మండలంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ బార్ షాపు వద్ద మృతుడి కుమారుడు గురువారం ఏఈవో సందీప్ కు పదివేల రూపాయలు లంచం అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ సాంబయ్య పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏఈవోపై కేసు నమోదు చేసి శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయని డీఎస్పీ స్పష్టం చేశారు.


