ఏసీబీ వలలో ఏఈఈ
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
కాకతీయ, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) ప్రాంగణంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల బిల్లులు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేసిన అధికారిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓయూలో ఏఈఈగా పనిచేస్తున్న రాచకొంద శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేసి పట్టుకున్నారు.
ఓయూ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు సంబంధించిన బిల్లులను త్వరగా ఆమోదించి విడుదల చేయిస్తానని చెప్పి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళికతో అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏఈఈని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల నియంత్రణకు ఏసీబీ నిరంతరం నిఘా ఉంచుతోందని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు లంచం కోరితే ప్రజలు ఏసీబీని సంప్రదించాలని అధికారులు తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్: 1064, వాట్సాప్ నంబర్: 94404 46106


