- వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ ఐటీ టవర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆధునాతన సాంకేతిక కేంద్రం (ఏ.టి.సి)ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐ సెంటర్లను ఆధునాతన సాంకేతిక కేంద్రాలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కరీంనగర్ ఏటిసీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సపతి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో ఏ.టి.సి లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే పలు కోర్సులు ప్రారంభమయ్యాయని, తల్లిదండ్రులు ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి సాంప్రదాయ కోర్సులకే కాకుండా, త్వరగా ఉపాధి అవకాశాలు కలిగించే ఏ.టి.సి కోర్సుల వైపు కూడా పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రెడ్డి, టీజీఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


