అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్‌ను అధునాతన పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనంగా తీర్చిదిద్దగా, మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ అంబులెన్స్‌ను పరిశీలించారు. వాహనంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రిలేటర్, మానిటర్, ఆక్సిజన్ వ్యవస్థ తదితర అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ఈ పరికరాలు రోగులకు ప్రాణరక్షణలో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు 108 అత్యవసర సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో సమాచారం అందిన వెంటనే సిబ్బంది ఘటన స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు ప్రాథమిక వైద్యం అందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.


