గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, జగిత్యాల : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్), ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక వేడుక అని తెలిపారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ధర్మపురి క్షేత్రం పుష్కరాల సమయంలో రాష్ట్రానికి ప్రతిష్ఠను తీసుకువచ్చేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.


