బాల సదన్ నుంచి ఇద్దరు బాలికల దత్తత
హైదరాబాద్ దంపతులకు అప్పగింత
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బాల సదన్‌లో సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలను (9, 12 సంవత్సరాలు) హైదరాబాద్కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం దత్తతగా అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలు లేని దంపతులు దత్తతను తప్పనిసరిగా చట్టబద్ధ విధానంలోనే తీసుకోవాలని సూచించారు. అనాథ శిశువుల దత్తతతో పాటు రక్త సంబంధీకుల నుంచి దత్తత తీసుకోవాలనుకునే వారు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. దత్తత ప్రక్రియలో పారదర్శకత, పిల్లల హితమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీపీవో దుర్దాన పర్వీన్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ దనలక్ష్మి, శిశు గృహ మేనేజర్ (ఇన్‌చార్జి) తేజస్వి, రాజ్‌కుమార్, బాల సదనం సూపరింటెండెంట్ సంతోషి తదితరులు పాల్గొన్నారు.
బాలల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు.


